Chidambaram : కచ్ఛాతీవు (Katchatheevu) వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) ఎందుకు పిల్లిమొగ్గలు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం ప్రశ్నించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ కచ్ఛాతీవును శ్రీలంకకు అప్పగించి దేశానికి ద్రోహం చేశారంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలను జై శంకర్ సమర్థించారు. దాంతో ఎక్స్ (ట్విటర్) వేదికగా చిదంబరం కౌంటర్ ఇచ్చారు.
‘గత 50 ఏళ్లుగా మత్స్యకారులను నిర్బంధిస్తున్నారన్నది వాస్తవం. అదేవిధంగా శ్రీలంక మత్స్యకారులను భారత్ అదుపులోకి తీసుకుంటుంది. కేంద్రంలోని ప్రతి ప్రభుత్వం శ్రీలంకతో చర్చలు జరిపి మత్స్యకారులను విడిపిస్తోంది. జైశంకర్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా, విదేశాంగశాఖ సెక్రెటరీగా, విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఘటనలు జరిగాయి. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదా..? తమిళనాడులో ఇతర పార్టీలతో బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు జరగలేదా..?’ అని చిదంబరం ప్రశ్నించారు.
‘ఇప్పుడు కాంగ్రెస్, డీఎంకేపై విమర్శలు చేయడానికి కొత్తగా కనిపించిన కారణం ఏమిటి..? 2015 జనవరి 27 నాటి ఆర్టీఐ సమాధానాన్ని ఒకసారి చూడండి. ఆ దీవిని శ్రీలంకకు ఇవ్వడానికి గల కారణాన్ని అందులో వివరించారు. కానీ ఇప్పుడు ఎందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పిల్లిమొగ్గలు వేస్తోంది. ఒక ఉదారవాద అధికారి ఇప్పుడు ఆర్ఎస్ఎస్-బీజేపీ మౌత్‌పీస్‌గా మారిపోయారు. కొందరు ఎంత వేగంగా రంగులు మార్చగలరో..!’ అని మంత్రి జైశంకర్‌ను ఉద్దేశించి చిదంబరం పోస్టు పెట్టారు.