ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించడంతోపాటు వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడంపై పెద్ద ఎత్తున నిరసనలు (Huge Protest In Manipur) వెల్లువెత్తాయి. మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో గురువారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. గిరిజనులు నల్ల దుస్తులు, నల్ల రిబ్బన్లు ధరించారు. గిరిజన మహిళలపై హేయమైన చర్యను ఖండించారు. తమ మహిళలకు భద్రత కల్పించాలని, న్యాయం చేయాలని గిరిజన సంఘ నేతలు డిమాండ్ చేశారు.
కాగా, మే 4న జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇది కలకలం రేపింది. చలించిపోయిన సుప్రీంకోర్టు కేంద్రానికి చీవాట్లు పెట్టింది. దీంతో మణిపూర్ పోలీసులు స్పందించారు. గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. మిగతా వారి అరెస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ హామీ ఇచ్చారు.
మరోవైపు గురువారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలను ఈ అంశం కుదిపేసింది. దీనిపై చర్చ జరుగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయసభలు శుక్రవారానికి వాయిదాపడ్డాయి.