న్యూఢిల్లీ: మణిపూర్‌కు చెందిన మహిళకు మరో వ్యక్తితో సంబంధం ఉందని సహజీవనం చేస్తున్న వ్యక్తి అనుమానించాడు. ఈ నేపథ్యంలో ఆమెను హత్య చేశాడు. (Woman Killed By Live-In-Partner) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు మణిపూర్‌కు చెందిన నిందితుడ్ని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మునిర్కా ప్రాంతంలో గాయాలతో కూడిన మహిళ మృతదేహం ఉన్నట్లు ఏప్రిల్ 8న పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్నారు. బిల్డింగ్‌లోని ఐదో అంతస్తులోని ఒక గదిలో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలిని మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌కు చెందిన లింగ్ జానెంగ్గా గుర్తించారు.
కాగా, ఆ ఇంట్లో నివసిస్తున్న మణిపూర్‌లోని సేనాపతి జిల్లాకు చెందిన జగ్మింతంగ్తో ఏడాదిగా ఆమె సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆ మహిళ హత్యకు ముందు రోజు రాత్రి మరో ముగ్గురితో కలిసి వారు పార్టీ చేసుకున్నట్లు స్థానికులు చెప్పారు.
మరోవైపు ఆ పార్టీ తర్వాత లింగ్ జానెంగ్కు మరో వ్యక్తితో సంబంధం ఉందన్న అనుమానంతో జగ్మింతంగ్ కొట్టి చంపినట్లు దర్యాప్తులో పోలీసులకు తెలిసింది. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే తొలుత పోలీసులను తప్పుదారిపట్టేందుకు ప్రయత్నించిన అతడు చివరకు ఆ మహిళను చంపినట్లు ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.