పాట్నా: బాలికా విద్యపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) సహనం కోల్పోయారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీపై మండిపడ్డారు. మీ పార్టీ ఏమీ చేయలేదని అన్నారు. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీ దేవిని సీఎం చేయడాన్ని ఎద్దేవా చేశారు. శుక్రవారం బీహార్ శాసన మండలిలో బాలికా విద్యపై చర్చ జరిగింది. తన ప్రాంతంలో బాలికల కోసం తగినని స్కూల్స్ లేవని ఆర్జేడీ ఎమ్మెల్సీ ఊర్మిళా ఠాకూర్ తెలిపారు. దీంతో విద్య కోసం కిలోమీటర్ల దూరంలోని స్కూల్స్‌కు వెళ్లేందుకు బాలికలు ఇబ్బందిపడుతున్నట్లు ఆమె చెప్పారు.
కాగా, విద్యా శాఖ మంత్రి సునీల్ కుమార్ ఇచ్చిన సమాధానంపై ఎమ్మెల్సీ ఊర్మిళా ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన బెగుసరాయ్ జిల్లాలో పరిస్థితిని ఆమె వివరించారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ‘బాలికల విద్య కోసం మేం ఏం చేశామో మీకు తెలుసా? మేం అధికారంలోకి వచ్చే వరకు బీహార్‌లో గ్రామీణ బాలికలు చాలా అరుదుగా స్కూల్స్‌కు వెళ్లేవారు’ అని అన్నారు.
మరోవైపు సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలను ఆర్జేడీ ఎమ్మెల్యీ ఊర్మిళా ఠాకూర్ ఖండించారు. ‘సార్ దయచేసి అలా అనకండి. నేను కూడా ఒక గ్రామం నుంచి వచ్చా. నేను పాత తరానికి చెందినదానిని. అయినప్పటికీ నా పాఠశాల విద్యను పూర్తి చేశా’ అని అన్నారు. ఇంతలో మరో ఆర్జేడీ ఎమ్మెల్సీ మున్నీ దేవి రాజక్ తన సీటు నుంచి పైకి లేచారు. ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాకు ఉంది. దానికి సమాధానం చెప్పడం మీ పని’ అని అన్నారు. దీంతో మున్నీ దేవిని సముదాయించేందుకు ఊర్మిళా ఠాకూర్ ప్రయత్నించారు.
కాగా, సీఎం నితీశ్ కుమార్ పూర్తిగా సహనం కోల్పోయారు. తన సీటు నుంచి లేచిన ఆయన ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ‘మహిళల కోసం మేం ఏమి చేశామో మీకు తెలియదు. మీరు మహిళలు కావచ్చు. కానీ మీ సహకారం ఏమిటి?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మండలిలో ప్రతిపక్ష నాయకురాలైన రబ్రీ దేవిపై మాటల దాడి చేశారు. ఆమె భర్త (లాలూ ప్రసాద్ యాదవ్) మునిగిపోతున్నప్పుడు తన భార్యను సీఎం చేశారు. మీ పార్టీ (ఆర్జేడీ) ఏమీ చేయలేదు. మీకు ఏమీ తెలియదు. మహిళల కోసం ఏమి చేసినా, అది నేనే చేశా. ఇప్పుడు మహిళలకు ఎలాంటి సమస్యలు లేవు’ అని అన్నారు. దీంతో మండలిలో గందరగోళం చెలరేగడంతో సీఎం నితీశ్ కుమార్ బయటకు వెళ్లిపోయారు.
Patna, Bihar: During the Bihar Legislative Assembly session, in response to RJD leader Urmila Thakur’s question, CM Nitish Kumar says, “We have done work for women…You belong to a party that has never done anything for women…” pic.twitter.com/ryJLEXUG3D
— IANS (@ians_india) March 7, 2025