న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రముఖ వైద్యశాలలో ఓ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. 70 ఏండ్ల వృద్ధుడి పిత్తాశయం(గాల్‌బ్లాడర్) నుంచి 8,125 రాళ్లు బయటకు తీశారు. తమ బృందం సుమారు గంట పాటు శ్రమించి ఈ సర్జరీ చేసిందని గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. రోగి కొన్నేండ్లుగా కడుపునొప్పి, తీవ్ర జ్వరం, ఆకలి లేకపోవడం, ఛాతీ, వెన్ను నొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నాడు. కొలెస్ట్రాల్ పెరగడం వల్లే ఈ రాళ్లు ఏర్పడినట్టుగా వైద్యులు నిర్ధారించారు.
మే 12న ఢిల్లీలోని ఓ వైద్యశాలలో నిర్వహించిన శస్త్రచికిత్సలో పెద్ద సంఖ్యలో రాళ్లను తొలగించారు. కొన్నేండ్లుగా ఆయన ఎలాంటి వైద్య సాయం తీసుకోకపోవడంతో ఇలా పేరుకుపోయినట్టు డాక్టర్ అమిత్ జావెద్ తెలిపారు. ప్రస్తుతం రోగి పరిస్థితి బాగానే ఉందని, శస్త్రచికిత్స జరిగిన రెండు రోజుల తర్వాత ఆయనను ఇంటికి పంపించినట్టు వారు చెప్పారు.