న్యూఢిల్లీ: దేశంలో వైద్యవిద్యను మరింత బలోపేతం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రానున్న కాలంలో మెడికల్ కాలేజీల్లో అదనంగా 10 వేల సీట్లను పెంచనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఐదేండ్లలో 75 వేలకు పైగా సీట్ల జోడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర బడ్జెట్ను (Union Budget) నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్తగా ఐఐటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా గత పదేండ్లలో దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్యం 100 శాతానికిపైగా పెరిగిందని చెప్పారు. కొత్తగా 5 ఐఐటీలను ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా మరో 6500 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఐఐటీల్లో అదనపు వసతులను సమకూరుస్తున్నామని వెల్లడించారు. విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని వినియోగిస్తామని చెప్పారు.
ఎంఎస్ఎంఈలపై దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఒక కోటి కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు నమోదైఉన్నాయన్నారు. ఉద్యోగ కల్పన బాగా ఉందని, నాణ్యమైన ఉత్పత్తులతో పాటు 45 శాతం ఎగుమతులు ఉన్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిస్తున్నామని, మూలధనం పెంచబోతున్నామని తెలిపారు. వచ్చే ఐదేండ్లలో 2.5 రెట్లు అధికంగా కేటాయింపులు చేస్తున్నామన్నారు. సూక్ష్మ పరిశ్రమలకు రాబోయే ఐదేండ్లలో రూ.1.5 లక్షల కోట్ల వరకు రుణాలు ఇస్తామని చెప్పారు.