సేలం: ఉత్తర భారత దేశంలో (Northern Indian states) వానలు (Heavy rains) దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా నదులు, కాలువలు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి పలు రాష్ట్రాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ప్రదేశ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో ఉత్తర భారతంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వేలాది ట్రక్కులు (Trucks) తమిళనాడులో (Tamil Nadu) నిలిచిపోయాయి. సజ్జలు, కొబ్బరికాయలు, స్టార్చ్, ఔషధాలలో ముడి పదార్థాలుగా ఉపయోగించే వస్తువులు, అగ్గిపెట్టెలు, పటాకులు, బట్టలు, ఇనుము ఉక్కు లోడ్లతో కూడిన 75 వేలకుపైగా ట్రక్కులు తమిళనాడులోని వివిధ పట్టణాలు, నగరాల్లో ఆగిపోయాయి.
అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన ఆపిల్స్, యంత్రాలు, టెక్స్టైల్ మెటీయల్స్ వంటి వస్తువులు ఉత్తరభారతం నుంచి రావడంలేదని తమిళనాడు లారీ ఓనర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు చెప్పారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరిన తర్వాత, ప్రయాణానికి అనుకూలంగా మారిన తర్వాతే తమిళనాడు నుంచి లారీలు బయల్దేరుతాయని వెల్లడించారు. అయితే భారీ వర్షాల వల్ల వస్తువులను ఆర్డర్ పెట్టిన కంపెనీలు, ట్రక్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.