కోల్‌కతా: గగన్‌యాన్ ప్రోగ్రామ్‌లో అత్యధిక పరీక్షలు పూర్తయ్యాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ వీ నారాయణన్ గురువారం తెలిపారు. కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2025వ సంవత్సరం ఇస్రోకు చాలా ముఖ్యమైనదని చెప్పారు. దీనిని గగన్‌యాన్ సంవత్సరంగా ప్రకటించామని గుర్తు చేశారు.
గగన్‌యాన్‌లో మానవుడిని దిగువ భూకక్ష్యలోకి పంపించడానికి ముందు మానవులు లేకుండా మూడు మిషన్స్‌ను పంపించాలని నిర్ణయించామన్నారు. వీటిలో మొదటిదైన వ్యోమమిత్రను ఈ ఏడాది డిసెంబరునాటికి ప్రయోగిస్తామని చెప్పారు. గగన్‌యాన్ కోసం 7,200కుపైగా పరీక్షలు పూర్తయ్యాయని, మిగిలిన సుమారు 3,000 పరీక్షలను నిర్వహించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
2027లోని మొదటి మూడు నెలల్లోనే మానవ సహిత గగన్‌యాన్‌ను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్పేడెక్స్ మిషన్ పూర్తయినందుకు హర్షం వ్యక్తం చేశారు. దీని కోసం 10 కిలోల ఇంధనం ఖర్చవుతుందని లెక్క వేశామని, అయితే, అందులో సగం ఇంధనంతోనే ఈ మిషన్‌ను పూర్తి చేశామని, మిగిలిన ఇంధనం అందుబాటులో ఉందని తెలిపారు.