న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) సైనిక దాడుల్లో భారత వైమానిక రక్షణ వ్యవస్థలు సత్తా చాటాయి. 600కుపైగా పాకిస్థాన్ డ్రోన్లను ఇవి కూల్చివేశాయి. భారత రక్షణ స్థావరాలకు ఎలాంటి నష్టం జరుగకుండా కాపాడాయి. మే 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ధ్వంసం చేసింది. దీనికి ప్రతిస్పందనగా భారత్ సరిహద్దులోని నగరాలను పాకిస్థాన్ సైన్యం లక్ష్యంగా చేసుకున్నది. భారత సైనిక స్థావరాలపై దాడుల కోసం వందలాది డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది.
కాగా, భారత వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా వాటిని అడ్డుకున్నాయి. 600కు పైగా పాకిస్థాన్ డ్రోన్లను కూల్చడంతోపాటు ధ్వంసం చేశాయి. పాక్ డ్రోన్లను అడ్డుకునేందుకు విస్తృతమైన వైమానిక రక్షణ గొడుగును భారత సైన్యం అమలు చేసింది. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) నుంచి అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వరకు పలు కీలక ప్రాంతాల్లో వెయ్యికిపైగా ఎయిర్ డిఫెన్స్ గన్స్‌ను మోహరించింది. ఎల్-70 ఎయిర్ డిఫెన్స్ గన్, జు-23 ఎంఎం గన్, శిల్కా గన్ సిస్టమ్ వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే పెద్ద వైమానిక ముప్పును ఎదుర్కొనేందుకు 750కు పైగా స్వల్ప శ్రేణి ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి (ఎస్ఏఎం) వ్యవస్థలను కూడా భారత సైన్యం మోహరించింది.
మరోవైపు భారత భూభాగంలోకి ప్రవేశించిన ప్రతి వైమానిక లక్ష్యాన్ని పర్యవేక్షించడం, ట్రాక్ చేయడం, ఎయిర్ ఢిఫెన్స్‌ను యాక్టివేట్ చేయడం కోసం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాష్ తిర్ వ్యవస్థ ఎంతో కీలకంగా వ్యవహరించింది. ఈ ఇంటిగ్రేటెడ్ ఏరియల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (ఐఏసీసీఎస్)ను కొన్ని నెలల కిందటే ఆకాష్ తిర్ ప్రాజెక్ట్ కింద వైమానిక దళంలోకి చేర్చినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. నిర్దిష్టమైన పనితీరును ప్రదర్శించినట్లు వివరించారు.