న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దాదాపు గత రెండేండ్ల నుంచి రకరకాలుగా రూపాలు మార్చుకుంటూ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. ఆల్ఫా, బీటా, డెల్టా అంటూ ఇప్పటికే పలు వేరియంట్లతో పడగవిప్పింది. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం కావాల్సి ఉంది. కానీ, దేశంలో వ్యాక్సినేషన్ నత్తనడకనే కొనసాగుతున్నది. భారీ జనసంఖ్య ఉన్న భారత్‌లో ఇప్పటివరకు 42 శాతం వ్యాక్సినేషన్ కూడా పూర్తికాలేదని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విమర్శించారు.
కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో 60 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని చెబుతున్నది. ఆ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ ట్వీట్ చేసింది. దేశ ప్రజల సహకారం, హెల్త్‌కేర్ వర్కర్స్ నిస్వార్థ సేవతో దేశంలో ఇప్పటివరకు 60 శాతం మందికి వ్యాక్సినేషన్ (రెండు డోసుల వ్యాక్సిన్) ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నది. దేశం ముందుముందు మరెన్నో మైలురాళ్లు దాటాలని ఆకాంక్షించింది. 60 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిన సందర్భంగా భారతదేశానికి అభినందనలు తెలియజేసింది.