న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి జూలై 15 మధ్య సెంట్రలైజ్డ్ పెన్షన్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CPENGRAMS) పోర్టల్ ద్వారా 55,000 కి పైగా పెన్షన్ సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభకు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ అలాగే రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అత్యధిక ఫిర్యాదుల అందినట్లు ఆయన వెల్లడించారు. 2025లో మొత్తం 63,310 పెన్షన్ సంబంధిత ఫిర్యాదులు అందగా, వాటిలో 55,554 CPENGRAMS పోర్టల్ ద్వారా పరిష్కరించబడినట్లు చెప్పారు. CPENGRAMS పోర్టల్‌లో పరిష్కరించబడిన ఫిర్యాదుల రేటు జనవరి 2025లో 35 రోజుల నుండి జూలై 2025లో 20 రోజులకు తగ్గిందన్నారు. ఇది పెన్షన్ ఫిర్యాదులను సకాలంలో, ప్రభావవంతమైన పరిష్కారాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.
ప్రభుత్వం 16 అక్టోబర్, 2024న ‘పెన్షన్ ఫిర్యాదుల ప్రభావవంతమైన పరిష్కారం’ కోసం పాలసీ సర్క్యులర్‌ను జారీ చేసిందని, ఇది మంత్రిత్వ శాఖలు/విభాగాలు 21 రోజుల్లోపు పెన్షన్ ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని నిర్దేశిస్తుందని ఆయన పేర్కొన్నారు. పెన్షన్ ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం థిమాటిక్ అదాలత్‌లు, నెలవారీ అంతర్-మంత్రిత్వ సమీక్ష సమావేశాలు, అధికారుల కోసం సామర్థ్య నిర్మాణ కార్యక్రమం, వార్షిక ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తుందని మంత్రి వెల్లడించారు. పింఛనుకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను పర్యవేక్షించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారాన్ని చూపించడమే CPENGRAMS విభాగం పని.