షిమ్లా: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)ను ఇటీవల భీకర వర్షాలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఆగస్టు నెలలో దాదాపు 38 వేల కంజెక్టివిటిస్(Conjuctivitis) కేసులు నమోదు అయ్యాయి. ఆగస్టు 28వ తేదీన ఒక్క రోజే సుమారు రెండు వేల కేసులు నమోదు అయినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ డేటా ప్రకారం.. మండి జిల్లాలో అత్యధికంగా 6048 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఇక ఆ తర్వాత కంగ్రా(5840), హమ్రిపుర్(5797), సోలన్(4033), చంబా(3944)లోనూ అధిక స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. కండ్లకలక లేదా ఐ ప్లూ లక్షణాలు ఉన్న కేసులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాకట్ర్ గోపాల్ బెర్రీ తెలిపారు. కండ్లు ఎర్రబడడం, అతుక్కుపోవడం, ఇరిటేషన్, వాపు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది చాలా సాధారణమైన ఇన్ఫెక్షన్ అని, ఎటువంటి చూపు సమస్య ఉండదని డాక్టర్ తెలిపారు. కంజెక్టివిటిస్ సోకిన వారు గుమ్మిగూడిన ప్రదేశాలకు వెళ్లవద్దు. పిల్లలకు సోకితే వాళ్లను ఓ వారం పాటు స్కూళ్లకు పంపవద్దు అని డాక్టర్లు చెబుతున్నారు.