Gujarat | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): బీజేపీ గొప్పలు చెప్పుకొనే గుజరాత్ నమూనా ఒట్టి డొల్లేనని మరోసారి తేలిపోయింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన మల్టీ డైమెన్షియల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం గుజరాత్లో 38.09 శాతం కుటుంబాలు పోషకాహార లోపంతో బాధపడుతున్నాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి వెనుకబడిన రాష్ర్టాలు గుజరాత్ కంటే మెరుగ్గా ఉన్నాయి. గుజరాత్ గ్రామీణ జనాభాలో 44.45 శాతం పోషకాహర లోపంతో బాధ పడుతున్నారని, పట్టణ ప్రాంతాల్లో 28.97 శాతం జనాభాకు పౌష్టికాహారం అందటం లేదని నివేదిక పేర్కొన్నది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది. 39 శాతం పిల్లలు వయసుకు తగ్గ బరువు లేరని నివేదిక బయట పెట్టింది. 2021లో పశ్చిమ బెంగాల్లో 27.3 శాతం, గుజరాత్లో 38.9% కుటుంబాలు పోషకారలోపంతో బాధ పడుతున్నాయి. గుజరాత్లో ప్రతి 100 మందిలో ముగ్గురు పోషకార లోపంతో బాధపడుతున్నారు. గృహ నిర్మాణంలో కూడా గుజరాత్ వెనుకబడి ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. గుజరాత్లో 23.30% జనాభాకు గృహ వసతి లేదని వెల్లడించింది. హర్యానా, పంజాబ్, కేరళ కంటే గుజరాత్ వెనుకబడి ఉందని తెలిపింది.
పేదరికమూ ఎక్కువే!
పేదరిక సూచీలోనూ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తదితర రాష్ర్టాల కంటే గుజరాత్ వెనుకబడి ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదిక ప్రకారం 2019-21లో గుజరాత్లో 11.66% పేదరికం ఉంది. అహ్మదాబాద్, సూరత్, వడోదర వంటి నగరాల్లోనూ పేదలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దాహోద్లో అత్యధికంగా 38.27 శాతం పేదలు ఉన్నారని చెప్పింది.
Pp