ముంబై, జూలై 27 : బీజేపీ పాలిత మహారాష్ట్రలో మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రవేశపెట్టిన లడ్కీ బెహన్ యోజన పథకంలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. ఈ పథకం కింద పురుషులు కూడా పేర్లు నమోదు చేసుకోగా, వారికి ప్రభుత్వం కళ్లు మూసుకుని నెలకు రూ.1500 ఇచ్చేస్తున్నది. పథకం నిబంధనలు ఎక్కడా అమలు కాకుండా యథేచ్ఛగా దుర్వినియోగమవుతున్నట్టు తాజాగా జరిపిన తనిఖీల్లో అధికారులు గుర్తించారు. మహిళల్లా నమోదు చేసుకున్న 14 వేల మంది పురుషులు ఈ పథకం కింద రూ.21 కోట్లకు పైగా కాజేసినట్టు అధికారులు గుర్తించారు. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల కన్నా తక్కువ ఉన్న 21 నుంచి 65 ఏండ్ల మహిళలకు నెలకు రూ.1500 ఈ పథకం కింద మహారాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. 2024 మహారాష్ట్ర ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రకటించిన ఈ పథకం ఆ కూటమి విజయానికి దోహదం చేసింది. రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో ఈ పథకం కింద 14,298 మంది పురుషులు కూడా మహిళల్లా నమోదై 21.44 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు నిర్ధారించారు.
10 నెలలుగా ఈ ఆక్రమాలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. అలాగే ఈ పథకం కింద ఒక్కో ఇంటి నుంచి గరిష్ఠంగా ఇద్దరు మహిళలు మాత్రమే నమోదు కావాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 7.97 లక్షల మంది ఒకే కుటుంబం నుంచి అధికంగా నమోదైనట్టు గుర్తించారు. ఇలా ఈ పథకం కింద 1,196 కోట్ల రూపాయలను అక్రమంగా పొందారు. పథకంలో గరిష్ఠ వయసు 65 ఏండ్లు కాగా, 65 ఏండ్లు పైబడిన 2.87 లక్షల మంది మహిళలు అక్రమంగా నమోదై ఖజానాకు 431.7 కోట్లకు చిల్లు పెట్టారు. కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉన్న 1.62 లక్షల మంది మహిళలు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. నిబంధనల ప్రకారం వీరు ఈ పథకానికి అనర్హులు. అసలు ఈ పథక లబ్ధిదారుల రిజిస్ట్రేషన్‌ను ఏ సంస్థకు ఇచ్చారు. మహిళలకు ఉద్దేశించిన ఈ పథకంలో పురుషులు ఎలా రిజిస్టరై లబ్ధి పొందుతున్నారు? దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉంది. ఈ అక్రమాలపై సిట్ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు.
ముంబై: మహారాష్ట్రలో మరో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళను అపహరించిన ఒక వ్యక్తి కారులో ఆమెపై లైంగిక దాడి చేసి రోడ్డుపై పడేసిన ఘటన పుణె జిల్లాలో చేటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మావల్ ప్రాంతంలోని తుంగర్లిలో నివసిస్తున్న 23 ఏండ్ల మహిళ శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్తుండగా, కారులో వచ్చిన 35 ఏండ్ల వ్యక్తి ఆమెను బలవంతంగా కారులోకి లాక్కుని వెళ్లాడు. ఆమెపై కారులోనే పలుసార్లు లైంగిక దాడిచేశాడు. ఆమెను రాత్రంతా పలు ప్రదేశాలలో తిప్పి శనివారం తెల్లవారుజామున ముంబైకి 80 కి.మీ దూరంలోని లోనావాలా ప్రాంతంలో రోడ్డుపై పడేశాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలి మాటలు అనుమానాస్పదంగా ఉండటంతో నిజానిజాలు పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.