IndiGo |టుర్కియో రాజధాని ఇస్తాంబుల్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో సుమారు వంద మంది ప్రయాణికులు శనివారం ఉదయం నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి వరకూ ఉండిపోయారు. 16 గంటలకు పైగా అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 6.55 గంటలకు ముంబై నుంచి విమానం బయలుదేరాలి. కానీ ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దాని టేకాఫ్ రాత్రి 11 గంటలకు రీషెడ్యూల్ చేశారు.
16 గంటలకు పైగా విమానం టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. తమకు ఇండిగో యాజమాన్యం ఎటువంటి అప్ డేట్ సమాచారం ఇవ్వలేదని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు. అయితే ఆపరేషనల్ కారణాల వల్లే విమానం ఆలస్యమైందంటూ ఇండిగో వివరణ ఇచ్చింది. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆన్ బోర్డు విమానంలో కూర్చుండబెట్టారని, దీనివల్ల కన్ఫూజన్, ప్రస్టేషన్ వచ్చేసిందన్నారు. ఒక ప్రయాణికుడు తనకు 13 గంటల తర్వాత తాగడానికి ఒక వాటర్ బాటిల్ మాత్రమే ఇచ్చారని ఆరోపించాడు. చివరకు విమాన సర్వీసు రద్దు చేసినట్లు ఇండిగో సిబ్బంది చెప్పారు.
రోజంతా విమానం టేకాఫ్ సమయం పలు దఫాలుగా వాయిదా పడింది. పలు సార్లు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే తమను డీబోర్డు, బోర్డు చేశారని ఆరోపించారు. విమానం టేకాఫ్ కావడం ఆలస్యం కావడంతో లోపల ఏసీ నిలిపేయడంతో అసౌకర్యంగా ఉందని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. విమాన సర్వీస్ రీషెడ్యూలింగ్ లేదా టికెట్ డబ్బులు రీఫండ్ చేసే విషయమై విమానయాన సిబ్బందికి సమాచారం లేదని, సిబ్బంది దురుసు ప్రవర్తన తమను నిరాశ పరిచిందని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.