న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో విద్వేషపూరిత రాజకీయాలు పెచ్చుమీరాయని ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు ఆరోపించారు. ముస్లింలు, ఇతర మైనారిటీలతో పాటు రాజ్యాంగాన్ని సైతం ధ్వంసం చేస్తున్న ఇలాంటి చర్యలకు ముగింపు పలికేలా చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు.
ఈ మేరకు 108 మంది మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. అస్సాం, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని, ఈ రాష్ర్టాలన్నీ బీజేపీ అధికారంలో ఉన్నవేనని గుర్తుచేశారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకొంటున్న ఈ ఏడాదిలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో విద్వేష రాజకీయాలకు ముగింపు పలుకాలని విజ్ఙప్తి చేశారు. లేఖపై సంతకం చేసిన వారిలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ జాతీయ భద్రత సలహాదారు శివశంకర్ మీనన్ తదితరులు ఉన్నారు.