High Court | భువనేశ్వర్: బాగా చదువుకున్న భార్యకు లాభదాయకమైన ఉద్యోగం చేసిన అనుభవం ఉన్నప్పటికీ, కేవలం తన భర్త నుంచి పోషణ భత్యాన్ని కోరడం కోసం ఖాళీగా ఉండకూడదని ఒరిస్సా హైకోర్టు చెప్పింది. ఆమెకు పోషణ భత్యం కింద నెలకు రూ.8,000 ఇవ్వాలని కుటుంబ న్యాయస్థానం ఆమె భర్తకు ఇచ్చిన ఆదేశాలను సవరించి, నెలకు రూ.5,000కు తగ్గించింది.
సరైన, ఉన్నత స్థాయి విద్యార్హతలు ఉన్నప్పటికీ, భర్తపై పోషణ భత్యం భారం మోపాలనే ఉద్దేశంతో, ఏదైనా ఉద్యోగం లేదా పని చేయకుండా ఖాళీగా కూర్చునే భార్యను చట్టం మన్నించదని తెలిపింది. తమను తాము పోషించుకునే స్థితిలో లేని భార్యలకు ఉపశమనం కల్పించడమే సీఆర్పీసీ సెక్షన్ 125 లక్ష్యమని చెప్పింది.