న్యూఢిల్లీ : సత్ర్పవర్తన కారణంగానే బిల్కీస్ బానో లైంగిక దాడి కేసులో దోషులను విడుదల చేశామని గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలపడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. దోషులు 14 ఏండ్లు జైలు శిక్ష అనుభవించారని, వారి ప్రవర్తన మెరుగ్గా ఉండటంతో విడుదల చేశామని సర్వోన్నత న్యాయస్ధానం ఎదుట దాఖలు చేసిన అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందని కూడా అఫిడవిట్ పేర్కొంది.
ఎర్రకోట నుంచి మహిళల భద్రతపై భరోసా ఇస్తారు..వాస్తవంలో రేపిస్టులకు మద్దతు ఇస్తారు..ప్రధాని మోదీ హామీలు, ఆయన ఉద్దేశం వెనుక వ్యత్యాసం ఉంది..ప్రధాని మహిళలను మోసగించారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇక ఈ ఘటనను లైంగిక దాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ఇటీవల పెరోల్ మంజూరైన డేరా బాబా ఉదంతంతో కాంగ్రెస్ ప్రతినిధి షమ మహ్మద్ పోల్చారు.
బిల్కీస్ బానో లైంగిక దాడి కేసులో దోషులు, హంతకులు విడుదలైన వేళ స్వీట్లు పంచారని, హత్యాచార కేసులో దోషి గుర్మీత్ రాం రహీం అలియాస్ డేరా బాబా పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం పలికారని, గుజరాత్, హర్యానా రెండు రాష్ట్రాల్లోనూ కాషాయ సర్కార్ రాజ్యమేలుతోందని ఆమె ట్వీట్ చేశారు. బీజేపీ రేపిస్టులను ఎందుకు హీరోలుగా ట్రీట్ చేస్తోందని ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా దేశ మహిళలకు సమాధానం చెప్పాలని ఆమె నిలదీశారు. బిల్కీస్ బానో కేసులో దోషులను విడుదల చేయడం పట్ల శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఎంఐఎం ప్రతినిధి వారిస్ పఠాన్ కూడా బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.