న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలలో గురువారం నాలుగవ రోజు కూడా గందరగోళ వాతావరణం కొనసాగింది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ విపక్షాలు నినాదాలు చేయడంతో రభస ఏర్పడి సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. లోక్సభ సమావేశమైన వెంటనే విపక్ష సభ్యులు ప్లకార్డులు చేత ధరించి ముందుకు దూసుకువచ్చారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణ ప్రసాద్ గోవా అసెంబ్లీలో ఎస్టీల రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లుపై చర్చించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
ఎస్టీ జనాభాకు మేలు చేసే బిల్లుపై చర్చకు ఎందుకు అనుమతించడం లేదని న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ విపక్ష సభ్యులను ప్రశ్నించారు. అయితే విపక్ష సభ్యులు తమ నిరసనలు కొనసాగించడంతో సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. అంతకుముందు స్పీకర్ ఓం బిర్లా సభలో మాట్లాడుతూ నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం సభకు గౌరవం కాదని పదేపదే తెలిపారు.
బీహార్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఉపసంహరించాలని డిమాండు చేస్తూ విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో గురువారం మధ్యాహ్నం వాయిదా అనంతరం పునఃప్రారంభమైన రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన వెంటనే అధ్యక్ష స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలిత సముద్ర మార్గాన సరకుల రవాణా బిల్లును చర్చ కోసం సభలో ప్రవేశపెట్టారు.
ఈ బిల్లుపై చర్చ జరుగుతుండగా విపక్ష సభ్యులు తమ నిరసనలను కొనసాగిస్తూ బిల్లుపై మాట్లాడుతున్న ఎంపీ సమీపానికి చేరుకుని నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. సర్ ప్రక్రియపై పార్లమెంట్ బయట విపక్షాలు ప్లకార్డులు ప్రదర్శించాయి.