Opposition meet | మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలు.. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమిపై పడింది. ఈ నెల బెంగళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో విడత సమావేశం (Opposition meet) వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Parliament Monsoon session) తర్వాత ప్రతిపక్ష నేతల భేటీ నిర్వహించనున్నట్లు జేడీయూ (JD(U)) ప్రకటించింది. అయితే, విపక్ష కూటమిలో కీలకమైన శరద్ పవార్ సొంత పార్టీలో చీలికల కారణంగానే విపక్షపార్టీల నేతల భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. జేడీయూ మాత్రం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సహా బీహార్, కర్ణాటక అసెంబ్లీ సమావేశాలను కూడా మరో కారణంగా చెబుతోంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, బీహార్, కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున బెంగళూరులో జరగాల్సిన సమావేశం వాయిదాకు కారణమని జేడీయూ నేత కేసీ త్యాగి (KC Tyagi) చెప్పారు. బీహార్ అసెంబ్లీ సమావేశాలకు.. తాను, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అందుబాటులో ఉండాలి కాబట్టి విపక్షాల రెండో భేటీని వాయిదా వేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. అదే సమయంలో బీహార్ అసెంబ్లీ సమావేశాలు కూడా జులై 10 నుంచి 24 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల భేటీ వాయిదావేసినట్లు త్యాగి తెలిపారు. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీను ఎదుర్కొనేలా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జూన్ 23 న పట్నా వేదికగా ప్రతిపక్ష పార్టీల భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెలలో మరోసారి ప్రతిపక్ష నేతలంతా సమావేశమవ్వాలని నిర్ణయించారు. బెంగళూరు వేదికగా జులై 13, 14 తేదీల్లో ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష నేతల భేటీ వాయిదా వేసినట్లు జేడీయూ ప్రకటించింది.
Also Read..
Madhya Pradesh | మహిళ అనుమానాస్పద మృతి.. మృతదేహాన్ని రెండు రోజులుగా ఫ్రీజర్‌లోనే పెట్టిన భర్త..
Sharad Pawar | కుటుంబంలో సమస్యలు లేవు.. ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకూ ఆటంకం లేదు : ఎన్సీపీ చీలికపై పవార్