PM Modi : మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. బిల్లు విషయంలో విపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయని, అందుకు జీవితాంతం చింతిస్తాయని అన్నారు. ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో శనివారం కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) సమావేశం జరిగింది.
ఆ సమావేశంలో ప్రధాని మోదీ విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు పెద్ద తప్పు చేశాయని అన్నారు. అందుకు వారు భారీ మూల్యం చెల్లించక తప్పదని వ్యాఖ్యానించారు. బిల్లును వ్యతిరేకించి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు మహిళలకు వ్యతిరేకమనే విషయాన్ని ప్రతి గ్రామానికి చేరేలా తెలియజేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే ఆ బిల్లుకు మద్దతుగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పోలయ్యాయి. భారత రాజ్యాంగం ప్రకారం ఒక రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. ఆ ప్రకారం బిల్లుకు మద్దతుగా మరో 62 ఓట్లు (మొత్తం 360 ఓట్లు) పోల్ కావాల్సి ఉండే. కానీ అలా జరగలేదు. కేవలం 230 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దాంతో బిల్లు వీగిపోయింది.