UPSC Lateral Entry | న్యూఢిల్లీ, ఆగస్టు 18: ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఉన్నత స్థానాల్లో నియామకాలకు లేటరల్ ఎంట్రీ విధానం కింద కేంద్రం యూపీఎస్సీ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఇది దొడ్డిదారిన తమ సైద్ధాంతిక మిత్రులను ఉన్నత స్థానాల్లో నియమించుకోవడానికి బీజేపీ పన్నిన కుట్ర అని ధ్వజమెత్తాయి. ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనే అని పేర్కొన్నాయి. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ఈ నిర్ణయంపై అక్టోబర్ 2 నుంచి ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ విధానం ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు, యువత భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు చేరే మార్గాలను మూసివేస్తుందని అన్నారు.
సామాన్యులు గుమస్తాలు, ప్యూన్ ఉద్యోగాలకే పరిమితం అవుతారని అన్నారు. మొత్తం మీద ఈ విధానం ద్వారా దళితులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను, హక్కులను లాక్కోవడానికి కేంద్రం పన్నిన కుట్ర అని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కడమే కాక, రిజర్వేషన్ల విధానంపై రెట్టింపు దాడి చేస్తున్నదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విభాగాల వారికి రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా చేయడానికి మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పనికి పూనుకున్నదని అన్నారు.
మన దేశంలోని రిజర్వేషన్ల వ్యవస్థ, రాజ్యాంగంపై కేంద్రం క్రూరమైన జోక్ వేసిందని మోదీ ప్రభుత్వాన్ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. లేటరల్ ఎంట్రీ ద్వారా చేపట్టే 45 పోస్టుల నియామకాన్ని ప్రస్తుత సంప్రదాయ సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారా చేపడితే ఇంచుమించు సగం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు దక్కుతాయని అన్నారు. కాగా, 2018లో ఈ విధానం ద్వారా కేంద్రం 63 పోస్టుల నియామకాలు చేపట్టగా, 35 మంది ప్రైవేట్ సెక్టార్‌కు చెందిన వారు. వీరిలో ప్రస్తుతం 57 మంది వివిధ మంత్రిత్వ, ప్రభుత్వ శాఖల్లో ముఖ్యమైన హోదాల్లో ఉన్నారు.
న్యూఢిల్లీ: ఐఐటీ-న్యూఢిల్లీకి జీఎస్టీ డైరెక్టర్ జనరల్ నోటీసులు జారీ చేశారు. రిసెర్చ్ కోసం 2017 నుంచి 2022 వరకు సంస్థకు వచ్చిన నిధులపై జీఎస్టీ, వడ్డీ, అపరాధ రుసుములు కలిపి రూ.120 కోట్లు చెల్లించాలంటూ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. పలు సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, రాష్ర్టాల్లోని పలు ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు కూడా జీఎస్టీ నోటీసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. దీనిపై కేంద్ర విద్యా శాఖలోని ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ సాధారణంగా పరిశోధనల నిమిత్తం విద్యా సంస్థలకు ఇస్తున్న నిధులపై జీఎస్టీ విధించరని, ఇది పొరపాటున జరిగి ఉంటుందని భావిస్తున్నామన్నారు. పరిశోధనల అభివృద్ధికి విద్యాసంస్థలకు వచ్చే నిధులపై జీఎస్టీ విధించడం పట్ల ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ట్యాక్స్ టెర్రరిజమని పేర్కొంటూ దీనికి అంతులేదా? అన్ని ప్రశ్నించారు.