న్యూఢిల్లీ, జూలై 26: రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. బీజేపీపై సైద్ధాంతిక, రాజకీయ పోరాటం సాగిస్తున్న శక్తుల ప్రతిష్టను దెబ్బతీసి, వాటిని బలహీనపర్చాలన్న ధ్యేయంతోనే నరేంద్రమోదీ సర్కార్ ఈ విధంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డాయి. ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవారం పలు విపక్షాలు ఉమ్మడిగా ఓ లేఖను రాశాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు మోదీ సర్కార్ విఘాతం కలిగిస్తున్నదని, ధరల పెరుగుదల, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పెంపు తదితర సమస్యలపై అత్యవసర చర్చకు అనుమతించకుండా మొండిగా వ్యవహరిస్తున్నదని విపక్షాలు ఆ లేఖలో పేర్కొన్నాయి. దీనిపై కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, సీపీఎం తదితర విపక్షాల నేతలు సంతకాలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండోసారి ప్రశ్నిస్తున్న తరుణంలో విపక్షాలు ఈ లేఖ రాయడం గమనార్హం.