Operation Tiger : మహారాష్ట్ర (Maharastra) రాజకీయాల్లో శివసేన (Shiv Sena) వ్యవస్థాపక దినోత్సవానికి ఒకరోజు ముందే ఊహించని రాజకీయ భూకంపం సంభవించింది. మాజీ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలో ‘ఆపరేషన్ టైగర్ (Operation Tiger)’ విజయవంతం అయ్యింది. దాంతో ఉద్ధవ్ థాకరే (Uddav Thakeray) వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. వీరంతా తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) కు అధికారికంగా లేఖ సమర్పించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తమపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు అవసరమైన మూడింట రెండు వంతుల మంది ఎంపీల మద్దతును కూడగట్టుకుని వీరు షిండే వర్గంలో చేరేందుకు రెడీ అయిపోయారు.
ఈ పరిణామంతో పార్లమెంట్లో షిండే శివసేన బలం ఒక్కసారిగా 7 నుంచి 13కు పెరగనుంది. ఈ భారీ చీలికతో దేశ రాజధాని న్యూఢిల్లీలో బీజేపీ నేతృత్వంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే బేరసారాల శక్తి అమాంతం పెరగనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కేవలం సహాయ మంత్రి పదవులతోనే సరిపెట్టుకున్న షిండే వర్గం, ఇకపై కీలకమైన క్యాబినెట్ మంత్రి పదవుల కోసం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో కూడా బీజేపీపై షిండే పట్టు సాధించవచ్చు. ఈ ఆపరేషన్ దాదాపు ముగింపు దశకు వచ్చిందని షిండే మద్దతుదారులు చెబుతున్నారు. ముంబైలో జరగబోయే శివసేన ఉత్సవాల్లో ఈ విలీనంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఈ పరిణామాలపై ఉద్ధవ్ థాకరే వర్గం మండిపడుతోంది. ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ అత్యవసరంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, తమ ఎంపీలను భారీ ఆర్థిక ప్యాకేజీలు, దర్యాప్తు సంస్థల భయంతోనే లొంగతీసుకున్నారని ఆరోపించారు. మిగిలిన ఎంపీలతో కలిసి పార్టీ సమావేశాన్ని నిర్వహించి తదుపరి కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. గతంలో 2022లో ఎమ్మెల్యేలను చీల్చి షిండే అధికారం చేపట్టిన తరహాలోనే ఇప్పుడు పార్లమెంట్ వేదికగా సాగిన ఈ నిశ్శబ్ద తిరుగుబాటు మహారాష్ట్రతోపాటు జాతీయ రాజకీయాల్లోనూ అధికార సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది. లోక్సభ స్పీకర్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది.