Operation Sindoor | ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భార్యల కండ్లముందే భర్తలను హతమార్చారు. బిడ్డల కండ్లముందే తండ్రులు ప్రాణాలు విడిచారు. ముష్కరుల కర్కషత్వం చూసి దేశం మొత్తం నివ్వెరపోయింది. ఆడబిడ్డల నుదుటి సిందూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదులను శిక్షించి న్యాయం చేస్తామని మోదీ ప్రభుత్వం చెప్పింది. ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించి, అర్ధాంతరంగా ఆపేసింది. కనీసం ఆ నలుగురు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టలేదు. మరి ఆ ఆడబిడ్డల కన్నీళ్లకు ప్రతీకారం తీర్చుకున్నదెక్కడ?
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఐదుగురు జవాన్లు వీరమరణం పొందినట్టు సైన్యం అధికారికంగా ప్రకటించింది. పాక్ సైన్యం జరిపిన దాడుల్లో అమాయక పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పాక్ కాళ్ల బేరానికి వచ్చిందని, కాల్పుల విరమణకు ప్రతిపాదించిందని గొప్పలు చెప్పుకున్నా.. జవాన్ల మరణాలు ఆగలేదు. పాకిస్థాన్ జరిపిన దాడుల్లో మరో ఇద్దరు జవాన్లు మరణించినట్టు సోమవారం వార్తలు వచ్చాయి. మరి దేశ రక్షణలో భాగంగా, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వీరోచితంగా పోరాడి అసువులుబాసిన జవాన్ల త్యాగాలకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఫలితం ఎక్కడ?
ప్రధాని మోదీ ప్రసంగించి గంట కూడా గడవక ముందే పంజాబ్‌లోని జలంధర్‌లో పాక్ డ్రోన్ ప్రత్యక్షమైంది. దాన్ని కూల్చివేసినట్టు జలంధర్ డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు. అమృత్‌సర్‌లో బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అక్కడ దిగాల్సిన ఇండిగో (6ఇ2045) విమానాన్ని అత్యవసరంగా తిరిగి ఢిల్లీకే మళ్లించారు. మరోవైపు జమ్ము కశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో కూడా పాక్ ఆర్మీ డ్రోన్లు ఎగిరాయి. ఇండియాటుడే టీవీ వీటిని లైవ్‌లో చూపించింది. డ్రోన్ల భయానికి జమ్ము రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో లైట్లను ఆపేశారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో బ్లాక్ అవుట్ ప్రకటించారు. మంగళవారం జమ్ము, అమృత్సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్‌కోట్‌కు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్టు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.