న్యూఢిల్లీ, జూన్ 7: ఆపరేషన్ సిందూర్ స్టేజ్ డ్రామా అని, దేశభక్తి సెంటిమెంట్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను మోసం చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే నరేంద్రనాథ్ చక్రవర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆపరేషన్ సిందూర్ ఎపిసోడ్ మొత్తం చూస్తుంటే ఓ స్టేజ్ నాటకంలా కనిపిస్తున్నదని అన్నారు. దేశభక్తి కలిగిన ప్రజలు, మహిళల భావోద్వేగాలతో మోదీ ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈ వీడియో వైరల్ కావడంతో నరేంద్ర నాథ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వివాదంపై స్పందించిన నరేంద్ర నాథ్ తనకు భద్రతా బలగాలపై గౌరవం ఉందని, కొందరు రాజకీయ దురుద్దేశంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. దేశ వ్యతిరేక శక్తులతో నరేంద్రనాథ్ చక్రవర్తికి ఉన్న లింకులపై ఎన్ఐఏ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
పెద్ద దేశం భయంతో సైన్యాన్ని మోదీ ఆపేశారు : టీఎంసీ మంత్రి
పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత ఫిర్హాద్ హకీం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పెద్ద దేశం భయంతో ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్‌పై దాడి చేయకుండా సైన్యాన్ని ప్రధాని మోదీ ఆపేశారని ఆరోపించారు. ప్రధాని ఒక పిరికి వ్యక్తిలాగా వ్యవహరించారని చెప్పారు. తాను గొప్ప పని చేశానని, ‘ఆపరేషన్ సిందూర్’ ఘనత తనదేనని మోదీ ఎలా చెప్పుకోగలరని ఆయన ప్రశ్నించారు. దీనిపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందిస్తూ, ఫిర్హాద్ హకీం ఓ పాకిస్థానీ నేత మాదిరిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.