Pahalgam | బాలాసోర్: పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి భారత సైన్యంలో చేరాలనుందని ఒడిశాకు చెందిన తొమ్మిదేండ్ల తనూజ్ కుమార్ సత్పతి అన్నాడు. గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో అతడి తన తండ్రి ప్రశాంత్ సత్పతిని కోల్పోయాడు. తనకు ప్రధాని మోదీని కలిసే అవకాశం వస్తే తన లాగా మరే చిన్నారి తండ్రి లేని వారు కాకుండా చూడాలని కోరతానని తనూజ్ గురువారం బాలాసోర్ జిల్లాలోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ అన్నాడు.
‘నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నేను సైన్యం చేరాలని నిర్ణయించుకున్నాను’ అని తన తల్లి సమక్షంలో అతడు వ్యాఖ్యానించాడు. ‘బుధవారం ఉదయం నుంచి మేం వార్తలు చూస్తున్నాం. అవి నాకు, మా అమ్మ కు చాలా సంతృప్తిని ఇచ్చాయి. మేం మన ఆర్మీ పట్ల గర్విస్తున్నాం’ అని ఆపరేషన్ సిందూర్ గురించి తనూజ్ తెలిపారు. సైన్యంలో చేరాలన్న తన కొడుకు కోరిక నెరవేర్చేందుకు తాను ఏం కావాలన్నా చేస్తానని అతడి తల్లి ప్రియదర్శిని వెల్లడించారు. అయితే తన కొడుకు బాల్యాన్ని కోల్పోయినట్లు అనిపిస్తున్నదని.. అతడికి హఠాత్తుగా పరిణతి రావడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.