Operation Blue Star : స్వర్ణదేవాలయం (Golden temple) నుంచి ఉగ్రవాదుల (Terrorists) ను ఏరివేసేందుకు చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్ (Operation blue star) సరైన మార్గం కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు (Congress senior leader), కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం (P Chidambaram) అన్నారు. ఆ ఆపరేషన్ కారణంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేశారు.
ఆపరేషన్ బ్లూస్టార్ సరైన మార్గం కాదని, ఆ విషయాన్ని తాను అంగీకరిస్తానని చిదంబరం వ్యాఖ్యానించారు. ఆ పొరపాటు ఇందిరాగాంధీ ప్రాణాలనే తీసిందని అన్నారు. అయితే ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది అందరూ కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయమని ఆయన చెప్పారు. ఇండియన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్, పోలీసులు, సివిల్ డిఫెన్స్ కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయమని, ఈ విషయంలో కేవలం ఇందిరాగాంధీని మాత్రమే నిందించడం కరెక్టు కాదని అన్నారు.
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం కౌసాలీలోని కుశ్వంత్ సింగ్ లిటరరీ ఫెస్ట్‌లో ‘They Will Shoot You Madam : My Life Through Conflict’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన చిదంబరం.. ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గోల్డెన్ టెంపుల్లో దాగిన దమ్‌దామీ తక్షల్ నాయకుడు జర్నైల్ సింగ్ బింద్రన్ వాలే, అతని మనుషులను పట్టుకునేందుకు 1984 జూన్ 1 నుంచి 10 వరకు ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించారు. అదే ఏడాది అక్టోబర్ 31 న ఇందిరాగాంధీ బాడీగార్డుల చేతిలో హత్యకు గురయ్యారు.