న్యూఢిల్లీ, జూలై 23: కృత్రిమ మేధస్సు (ఏఐ) నేడు సమాజ పురోభివృద్ధికే కాకుండా వినాశనానికి కూడా దోహదపడుతున్నదని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అత్యంత ఆధునికమైన ఏఐ పరిజ్ఞానాన్ని మించిన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ఫెడరల్ రిజర్వ్ సదస్సులో ఆల్ట్మన్ మాట్లాడుతూ..ఏఐ ఆధారంగా జరుగుతున్న మోసాలను ఆర్థిక సంస్థలు తక్కువగా అంచనా వేస్తున్నాయని అన్నారు. అత్యంత ఆధునికమైన భద్రతా వ్యవస్థలను సైతం నేడు కృత్రిమ మేధస్సుతో ఎలా విచ్ఛిన్నం చేయవచ్చో ఆయన వివరించారు. ఈ విపత్తును వెంటనే అరికట్టకపోతే పరిణామాలు అత్యంత దిగ్భ్రాంతికరంగా ఉండవచ్చని హెచ్చరించారు.