న్యూఢిల్లీ: సిలికాన్ వ్యాలీలో జరిగిన కృత్రిమ మేధ (ఏఐ) చదరంగం టోర్నమెంట్లో ఓపెన్ఏఐకి చెందిన అత్యాధునిక మోడల్ చాట్‌జీపీటీ ఓ3 విజేతగా నిలిచింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ఏఐ విడుదల చేసిన గ్రోక్ 4ను ఫైనల్ రౌండ్లో ఓడించింది. దీంతో ఈ రెండు ప్రత్యర్థి కంపెనీల పోరులో ఓపెన్ఏఐకి ఆధిక్యత లభించింది.
కంప్యూటర్ ఇంటెలిజెన్స్‌ను నిరూపించుకోవడానికి చదరంగం సరైన వేదిక. ఆధునిక చెస్ ఇంజిన్స్ అత్యుత్తమ మానవ క్రీడాకారులను సైతం కట్టడి చేయగలవు. కానీ ఈసారి టోర్నమెంటు ప్రత్యేకమైనది. నిత్యం వినియోగించే ఏఐ మోడల్స్ తలపడ్డాయి. ఓపెన్ఏఐ, ఎక్స్ఏఐ, గూగుల్, ఆంథ్రోపిక్, డీప్‌సీక్, మూన్‌షాట్ ఏఐ ఒకదానితో మరొకటి తలపడ్డాయి. సెమీ ఫైనల్స్ వరకు గ్రోక్ 4 ఆధిక్యం కనబరచింది.
దీనిని ఆపతరం కాదన్నట్లుగా దూసుకెళ్లింది. కానీ ఫైనల్లో పరిస్థితులు మారిపోయాయి. గ్రోక్ పదే పదే తప్పులు చేసింది. రాణిని సైతం చాలాసార్లు కోల్పోయింది. ఓపెన్ఏఐకి చెందిన ఓ3 దాదాపు కచ్చితమైన ఆటను ఆడింది. ఈ ఆటల్లో గ్రోక్ చాలా తప్పులు చేసిందని, ఓపెన్ఏఐ అలా చేయలేదని చెస్ గ్రాండ్‌మాస్టర్ హికరు నకముర చెప్పారు. గూగుల్‌కు చెందిన జెమిని మూడో స్థానంలో నిలిచింది. గూగుల్‌కు చెందిన డాటా సైన్స్ పోటీల ప్లాట్‌ఫాం కాగ్లే ఈ ఈవెంట్‌ను నిర్వహించింది.