ChatGPT | శాన్ఫ్రాన్సిస్కో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ‘ఓపెన్ ఏఐ’ సంస్థ తన జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’లో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గూగుల్‌కు పోటీగా సెర్చ్ ఫంక్షన్‌ను జోడించింది. ‘చాట్‌జీపీటీ సెర్చ్’ అని పిలిచే ఈ కొత్త ఫీచర్‌తో ఓపెన్ఏఐ నేరుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు పోటీ ఇవ్వనున్నది. ప్రస్తుతం చాట్‌జీపీటీ పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కొత్త ఫీచర్‌ను క్రమంగా చాట్‌జీపీటీ వినియోగదారులందరికీ అందుబాటులోకి తెస్తామని ‘ఓపెన్ఏఐ’ ప్రకటించింది.
‘జీపీటీ-4ఓ’ ఫైన్-ట్యూన్డ్ వెర్షన్ అయిన ఈ సెర్చ్ మాడల్‌ను చాట్‌జీపీటీ ప్లస్, టీమ్ వినియోగదారులంతా గురువారం నుంచి యాక్సెస్ చేయగలుగుతున్నట్టు వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇకపై వెబ్‌లింక్స్‌తో కూడిన రియల్-టైమ్ సమాచారాన్ని తక్షణమే పొందవచ్చని, గతంలో మాదిరిగా సెర్చ్ ఇంజిన్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండబోదని వివరించింది.
వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ‘చాట్‌జీపీటీ సెర్చ్’ తన భాగస్వాములు నేరుగా అందించే కంటెంట్‌తోపాటు థర్డ్ పార్టీ సెర్చ్ ప్రొవైడర్ల సేవలను ఉపయోగించుకుంటున్నట్టు ఓపెన్ఏఐ ఓ బ్లాగ్ పోస్టులో పేర్కొన్నది.