న్యూఢిల్లీ: అమాయకులను చంపిన వారినే లక్ష్యంగా చేసుకున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తెలిపారు. హనుమంతుడు అనుసరించిన సూత్రాన్ని అనుసరించినట్లు చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’పై ఆయన స్పందించారు. బుధవారం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 బీఆర్వో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ఆయన మాట్లాడారు. భారత సాయుధ దళాలు తమ శౌర్యం, ధైర్యాన్ని ప్రదర్శించి కొత్త చరిత్రను లిఖించాయని ప్రశంసించారు.
కాగా, ఖచ్చితత్వం, అప్రమత్తత, సున్నితత్వంతో భారత సైనిక దళాలు చర్యలు చేపట్టాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ‘నిర్ణయించిన లక్ష్యాలను సరైన సమయంలో ఖచ్చితంగా ధ్వంసం చేశాం. పౌర జనాభా ఏమాత్రం ప్రభావితం కాకుండా చూసుకోవడంలో మన సాయుధ దళాలు సున్నితత్వాన్ని చూపించాయి. ఒక విధంగా, భారతీయ జవాన్లు ఖచ్చితత్వం, అప్రమత్తత, మానవత్వాన్ని చూపించారని మనం చెప్పగలం. మొత్తం దేశం తరపున జవాన్లు, అధికారులను నేను అభినందిస్తున్నా. సాయుధ దళాలకు మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోదీని కూడా నేను అభినందిస్తున్నా’ అని అన్నారు.
మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. బుధవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా కేంద్రాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. భారత్ దాడిలో సుమారు వంద మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తున్నది. భారత వైమానిక దళంతో పాటు, నేవీ, ఆర్మీ కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి.