చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన డీఎంకే మాజీ మంత్రి ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఆ స్థానంలో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలని కోరారు. (DMK ex-minister moves HC) డీఎంకే మాజీ మంత్రి కేఆర్ పెరియకరుప్పన్, తిరుపత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే టీవీకే అభ్యర్థి సీనివాస సేతుపతి చేతిలో కేవలం ఒక్క ఓటు తేడాతో ఆయన ఓడిపోయారు. సీనివాస సేతుపతి 83,375 ఓట్లు సాధించారు.
కాగా, శివగంగ జిల్లాలోని తిరుప్పత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓటరు మణికందన్ శివానంతం, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను ఓటు వేయడానికి మస్కట్ నుంచి వచ్చినందుకు ‘గర్వంగా’ ఉన్నదని తెలిపాడు. తన ఒక్కడి ఓటు ఇక్కడి ఫలితాన్ని మార్చి వేసి ఉంటుందని పేర్కొన్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ నేపథ్యంలో ఒక్క ఓటు తేడాతో ఓడిన డీఎంకే అభ్యర్థి కేఆర్ పెరియకరుప్పన్, మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్పై తుది తీర్పు వెలువడే వరకు కొత్తగా ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయకుండా లేదా శాసనసభ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిరోధించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
అయితే అసాధారణ పరిస్థితి నేపథ్యంలో పెరియకరుప్పన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు అంగీకరించింది. ఆదివారం ప్రత్యేకంగా కోర్టు కార్యకలాపాలు నిర్వహించింది.