కేరళ, త్రివేండ్రం ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : కేరళ ప్రముఖ కార్టూనిస్టు, శంకర్స్ వీక్లీ వ్యవస్థాపకుడు శంకర్ పిళ్ళై 120వ జయంతి కార్యక్రమంలో ‘నమస్తే తెలంగాణ’ కార్టూనిస్టు మృత్యుంజయ్ ‘తెలంగాణ ఉద్యమం, సమకాలీన రాజకీయాల’పై గీసిన కార్టూన్ ప్రజంటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శంకర్ పిళ్ళై జ్ఞాపకార్థం ఆ రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌరసంబంధాల శాఖ ‘మాస్టర్స్ స్ట్రోక్ ఏ ట్రిబ్యూట్ టు కార్టూనిస్టు శంకర్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని త్రివేండ్రంలో నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా కేరళ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డాక్టర్ వీపీ జాయ్, ప్రత్యేక అతిథులుగా హైదరాబాద్ నుంచి ‘నమస్తే తెలంగాణ’ కార్టూనిస్టు మృత్యుంజయ్, ఢిల్లీ నుంచి ‘పయనీర్’ కార్టూనిస్టు శేఖర్ గురేరా, ముంబై నుంచి ‘రీడర్స్ డైజెస్ట్’ కార్టూనిస్టు మోహన్ శివానంద్ హాజరయ్యారు. శంకర్‌తో అనుబంధాలను, జ్ఞాపకాలను నాటి కేరళ కార్టూనిస్టులు సుకుమార్, కృష్ణన్ ఈ సందర్భంగా పంచుకొన్నారు. అప్పటి ప్రధాని నెహ్రూ కార్టూనిస్టు శంకర్‌ని ‘డోంట్ స్పేర్ మీ శంకర్’ అని అడిగి మరీ తన కార్టూన్లను గీయించుకున్న విషయాన్ని గుర్తుచేశారు.