One Nation One Election | ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌కు పచ్చజెండా ఊపింది. త్వరలో జరుగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్‌ను కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నది. కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై కోవింద్ కమిటీకి విస్తృతంగా మద్దతు లభించిందని చెప్పారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని చెప్పారు. కోవింద్ కమిటీ సిఫార్సులపై దేశవ్యాప్తంగా వివిధ వేదికలపై చర్చ జరుగుతుందన్నారు.
ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. రాబోయే కొద్ది నెలల్లో ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తామన్నారు. తొలివిడతగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు చేసిందన్నారు. కమిటీ సిఫారసుల అమలును పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఇంప్లిమెంటేషన్ గ్రూప్‌ని సైతం ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. అయితే, ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా వనరులు ఆదా అవుతాయని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అభివృద్ధి, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించనున్నది. రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరిపి ఎన్నికల సంఘం ఏకరూప ఓటరు, ఓటరు గుర్తింపు కార్డును సిద్ధం చేయాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను మాత్రమే నిర్వహిస్తుంది.
మున్సిపాలిటీలు, పంచాయతీలకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. అయితే, కమిటీ 18వ రాజ్యాంగ సవరణలను సిఫారు చేసిందని.. వీటిలో చాలా వరకు రాష్ట్రాల అసెంబ్లీల మద్దతు అవసరం లేదని పేర్కొంది. అయితే, వీటికి కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లులు అవసరం, వీటిని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఒకే ఓటరు జాబితా.. ఒకే ఓటరు.. ఒకే గుర్తింపు కార్డుకు సంబంధించి ప్రతిపాదిత మార్పుల్లో కొన్నింటికి కనీసం సగం రాష్ట్రాల నుంచి మద్దతు అవసరం. దీంతో పాటు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై లా కమిషన్ తన నివేదికను కూడా త్వరలో విడుదల చేసే అవకాశం ఉన్నది. సమాచారం ప్రకారం.. లా కమిషన్ 2029 నుంచి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీలు, పంచాయతీ వంటి స్థానిక సంస్థలను ఏకకాలంలో నిర్వహించాలని సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.