న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కాలుష్యం దారుణంగా ఉంటున్నది. 2005-2018 మధ్యకాలంలో దేశంలోని ఎనిమిది నగరాల్లో వాయు కాలుష్యం కారణంగా లక్ష మంది మృత్యువాతపడినట్లు ఓ అంతర్జాతీయ అధ్యయనంలో తేలింది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఉపగ్రహాల నుంచి వచ్చిన డేటాను విశ్లేషించగా ఇందులో షాకింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎనిమిది నగరాల్లో ముంబై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, సూరత్, పూణే, అహ్మదాబాద్ ఉన్నాయి. యూకేలోని బర్మింగ్ హోం విశ్వవిదాల్యం, యూసీఎల్ పరిశోధకుల నేతృత్వంలో అధ్యయనం జరిగింది. వేగంగా పెరుగుతున్న కాలుష్యం కారణంగా 14 సంవత్సరాల్లో సుమారు 1.80లక్షల అకాల మరణాలు సంభవించాయని తేలింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు నగరాలపై అధ్యయనం నిర్వహించింది. దక్షిణాసియా ప్రాంతంలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, చిట్టగాంగ్, ఢాకా, హైదరాబాద్, కరాచీ, కోల్‌కతా, ముంబై, పుణే, సూరత్‌పై అధ్యయనం నిర్వహించారు. ఆగ్రేయాసియాలో బ్యాంకాక్, హనోయి, హోచిమిన్ సిటీ, జకార్తా, మనీలా, నమ్ పెన్, యాంగోన్, మధ్య-ప్రాచ్యంలో రియాద్, సనా.. ఆఫ్రికాలో అబిడ్జాన్, అబుజా, అడిస్ అబాబా, అంటనానారివో, బమాకో, బ్లాంటైర్, కొనాక్రీ, డాకర్, డార్ ఎస్ సలామ్, ఇబాడాన్, కడునా,
కంపాలా, కానో, ఖార్టూమ్, కిగాలీ, కిన్షాసా, లాగోస్, లిలోంగ్వే, లువాండా, లుబుంబాషి, మొంబాషి, నసాకా, జమేనా, నైరోబి, నియామీ, ఔగాడౌగౌ సిటీలపై అధ్యయనం నిర్వహించారు.
అధ్యయనం నివేదికను గతవారం సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. వాయు నాణ్యతలో వేగంగా క్షీణత, ఆరోగ్యానికి హాని కలిగించే నాణ్యత వేగంగా క్షీణిస్తున్నది. కాలుష్య కారకాలైన నైట్రోజన్ డయాక్సైడ్ (NO2)లో 14 శాతం వరకు, పర్టిక్యులేట్ మ్యాటర్లో (PM2.5) 8 శాతం వరకు గణనీయమైన పెరుగుదల ఉందని పరిశోధకులు గుర్తించారు. అమ్మోనియా స్థాయిలు 12 శాతం వరకు, అస్థిర కర్బన సమ్మేళనాలు 11 శాతం వరకు పెరిగాయి. పరిశోధకుల బృందంలో యూఎస్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు.
రోడ్లపై వాహనాలు, చెత్తను కాల్చివేయడం, బొగ్గు, కలపను విస్తృతంగా వినియోగించడం, పరిశ్రమల కారణంగా గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనం ప్రధాన రచయిత కరణ్ వోహ్రా, ఆయన బర్మింగ్ హోమ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తి చేశారు. వ్యవసాయ వ్యర్థాలు తగులబెట్టడంతో పలు చర్యలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని తెలిపారు. ఆయా నగరాల్లో వాయు కాలుష్యంతో కొత్త శకంలోకి ప్రవేశిస్తున్నామన్నారు.
నివేదిక ప్రకారం.. దక్షిణాసియాలో వాయు కాలుష్యం కారణంగా ఎక్కువ అకాల మరణాలు సంభవించాయి. ఇందులో బంగ్లా రాజధాని ఢాకాలోనే 24వేల మంది మరణించారు. భారత్‌లోని ఎనిమిది నగరాల్లో లక్షకుపైగా మరణాలు సంభవించాయి. రానున్న దశాబ్దాల్లో వాయు కాలుష్యం కారణంగా విపరీత పరిణామాలు కనిపిస్తాయని నివేదిక హెచ్చరించింది. అధ్యయన సహ రచయిత అలోయిస్ మారిస్ మాట్లాడుతూ వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి బదులు ఇతర చర్యలు చేపడుతున్నారన్నారు. పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధి రేసులో గత తప్పిదాల నుంచి పాఠాలు నోర్చుకోలేకపోతున్నారన్నారు. ఈ నివేదికతోనైనా ఇకపై పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.