న్యూఢిల్లీ, మే 27: ఈ ఏడాది 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం)పై విద్యార్థుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం కారణంగా తమ జవాబు పత్రాలు తారుమారు అయ్యాయంటూ పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జవాబు పత్రాల స్కానింగ్ కోసం పెద్దయెత్తున విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. పరీక్ష రాసిన ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరు దరఖాస్తు చేయడం గమనార్హం. ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను 17 లక్షల మంది విద్యార్థులు రాశారు. వీరిలో ఇప్పటివరకు 4,04,319 మంది స్కానింగ్ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
11,31,961 ఆన్సర్ బుక్‌ల కోసం విద్యార్థుల నుంచి అభ్యర్థనలు వచ్చాయని, ఇందులో 8,98,214 జవాబు పత్రాలను ఇప్పటికే ఆన్లైన్లో షేర్ చేసినట్టు అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రంలోగా మిగతా వాటిని కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. మార్కుల వెరిఫికేషన్, జవాబు పత్రాల రీ వాల్యుయేషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోర్టల్ మే 29 నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. కాగా, ఈ నెల 13న విడుదల చేసిన 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో గత ఏడాది కన్నా 3 శాతం ఉత్తీర్ణత తగ్గింది. అయితే ఈ ఏడాది అమల్లోకి తెచ్చిన ఓఎస్ఎం విధానం వల్ల పలువురి జవాబు పత్రాలు తారుమారయ్యాయని, అందుకో కొందరికి తక్కువ మార్కులు రాగా, పరీక్ష బాగా రాసిన చాలామంది ఫెయిల్ అయ్యారంటూ పలువురు విద్యార్థులు ఆరోపించారు.