Bakrid goat price : ఈ నెల 17న (సోమవారం) బక్రీద్ పండగ జరగనుంది. ముస్లిం సోదరులు జరుపుకొనే ఈ పండగ సందడి అప్పుడే మొదలైంది. ఈద్ ఉల్ జుహా, బక్రీద్, ఈద్ ఖుర్బాన్, ఖుర్బాన్ బైరామీ వంటి పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను త్యాగానికి ప్రతీకగా భావిస్తారు. ఖుర్బానీ ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత. మాంసాన్ని దానం చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది.
హైదరాబాద్లో ఈ పండగ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రార్ధనలు నిర్వహించే మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే మసీదులు, ఈద్గాలకు దారితీసే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఇక బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గొర్రెలు, మేకల అమ్మకాలు ఊపందుకున్నాయి.
ఈ గొర్రెలు, మేకల కొనుగోలు కోసం ముస్లింలు బారులు తీరుతున్నారు. ఫలితంగా వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణ రోజులతో పోల్చుకుంటే బక్రీద్ సందర్భంగా వీటి రేట్లు రెట్టింపు అవుతున్నాయి. మధ్యప్రదేశ్లోని భోపాల్లో గొర్రెలు, మేకల రేట్లు రికార్డు ధరలు పలుకుతున్నాయి. ఒక్కో మేక రూ.50,000 నుంచి రూ.7,50,000 వరకు అమ్ముడవుతున్నాయి.
తాను పెంచిన రాఫ్తార్ అనే ఓ మేకను రూ.7 లక్షలకు విక్రయించినట్లు సయ్యద్ షాదాబ్ అలీ అనే వ్యాపారి తెలిపారు. దీని బరువు 155 కేజీలు. అలాగే షాన్-ఎ- భోపాల్ అనే మరో మేకను నాలుగు లక్షల రూపాయలకు విక్రయించానని వెల్లడించారు. ముంబై, పూణె, నాగ్పూర్, రత్నగిరి, అహ్మదాబాద్, సూరత్, భరూచ్, రాజ్కోట్ వంటి నగరాలకు తాను గొర్రెలు, మేకలను అమ్ముతుంటానని చెప్పారు. ఇప్పుడు మరో మేకను రూ.7,50,000 లకు అమ్మకానికి ఉంచినట్లు తెలిపారు.
Madhya Pradesh: A goat seller in Bhopal is selling goats priced between Rs 50,000 to Rs 7.5 lakhs, ahead of Eid-al-Adha or Bakrid tomorrow.#Bakrid #MadhyaPradesh #Bhopal pic.twitter.com/WYLS5IFIkf
— IndiaToday (@IndiaToday) June 16, 2024