న్యూఢిల్లీ: ఇండియా మోడల్‌ను పాకిస్థాన్ ఫాలో అవుతున్నదని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (Karti Chidambaram) అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్‌ను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు. ‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడంలో భారత్ నమూనాను పాకిస్థాన్ అనుసరిస్తోంది’ అని ట్విట్టర్ నుంచి మారిన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కాగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మోదీ ఇంటి పేరు గురించి రాహుల్ చేసిన విమర్శలపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ ఆయనపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేండ్లు జైలు శిక్ష విధించింది. మార్చి 23న తీర్పు ఇవ్వగా వాయినాడ్ ఎంపీ అయిన రాహుల్‌పై లోక్‌సభ స్పీకర్ ఆ మరునాడే అనర్హత వేటు వేశారు. జైలు శిక్షపై స్టే కోసం రాహుల్ హైకోర్టులో అప్పీల్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
మరోవైపు వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేయకుండా అడ్డుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ఈ మేరకు కుట్ర పన్నిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడైన కార్తీ చిదంబరం, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌ను ఈ మేరకు పోల్చారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. జైలు శిక్షపై స్టే ఇవ్వడంతోపాటు ఆయన ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. అలాగే వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది.
Pakistan following the India model in preventing the principal opposition leader from contesting elections. https://t.co/vhmNtxyday
— Karti P Chidambaram (@KartiPC) August 5, 2023