Rail Roko : దేశ రాజధాని ఢిల్లీ శివారులోని పంజాబ్, హర్యానా సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు శనివారం టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. ఈ ఘటనల్లో 17 మంది రైతులు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో రైతులు తమ ఢిల్లీ చలో పాదయాత్రను నిలిపివేశారు. రైతులపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రైతు నేత సర్వాన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులను బలగాలను ప్రయోగించిందని విమర్శించారు. రైతులపై కెమికల్ వాటర్ ప్రయోగించిందని ఆరోపించారు. అంతేగాక భాష్ప వాయుగోళాలు ప్రయోగించారని, బాంబులు విసిరారని మండిపడ్డారు. ఈ ఘటనల్లో 17 మంది గాయపడ్డారని చెప్పారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
గాయపడ్డ రైతులకు సరైన చికిత్స కూడా అందించడం లేదని, వారికి సరైన చికిత్స అందేలా చూడాలని తాము పంజాబ్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని సర్వాన్ సింగ్ చెప్పారు. అదేవిధంగా తమ భవిష్యత్ కార్యాచరణను కూడా సింగ్ వెల్లడించారు. ఈ నెల 16న పంజాబ్ బయట ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 18న రైల్ రోకోకు పిలుపునిచ్చామని తెలిపారు.
రైల్ రోకోలో పంజాబీ రైతులంతా పాల్గొని జయప్రదం చేయాలని సర్వాన్ సింగ్ కోరారు. ప్రతిపక్షాలు తమపాత్రను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు మద్దతుగా కేవలం ప్రకటనలతో సరిపెట్టుకోవద్దని హితవు పలికారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని కోరారు. ఇతర అంశాలపై పార్లమెంట్‌ను స్తంభింపజేసినట్టే రైతు సమస్యలపై కూడా పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని డిమాండ్ చేశారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. రైతు సమస్యలపై పార్లమెంట్లో గళం వినిపిస్తానని హామీ ఇచ్చారని, కానీ ఆయన తన హామీని ఇంకా నిలిబెట్టుకోలేదని రైతు నేత సర్వాన్ సింగ్ వ్యాఖ్యానించారు.