ఇంఫాల్: జాతుల ఘర్షణలతో మణిపూర్ రగులుతోంది. శిబిరంలో తలదాచుకున్న కుకీ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే మైతీ మిలిటెంట్లు ఆమె భర్తను హత్య చేశారు. (Kuki Man Killed) చురచంద్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలు మళ్లీ తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో తమెంగ్లాంగ్ జిల్లాలోని పాంగ్మోల్ గ్రామానికి చెందిన హవోజోల్ డౌంగెల్ ప్రాణభయంతో తన కుటుంబంతో సహా పారిపోయాడు. ప్రభుత్వ శిబిరంలో ఆశ్రయం పొందాడు.
కాగా, హవోజోల్ భార్య నెంగ్బోయ్ గర్భవతి. ఆమెకు నెలలు నిండటంతో కాన్పు కోసం ఆర్థిక సహాయం కోరేందుకు జిరిఘాట్కు అతడు వెళ్లాడు. అయితే మైతీ మిలిటెంట్లు హవోజోల్ను కిడ్నాప్ చేసి చంపారు. జిరిబామ్‌లోని అంగ్లాపూర్ గ్రామ సమీపంలోని కల్వర్టులో అతడి మృతదేహం లభించింది.
మరోవైపు పురిటి నొప్పులు రావడంతో హవోజోల్ భార్య నెంగ్బోయ్ రిలీఫ్ క్యాంప్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను చూసి ఆమె సంతోషించేలోపు భర్త మృతదేహం ఆ శిబిరానికి చేరింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది.