న్యూఢిల్లీ: అప్పుగా తీసుకున్న రూ.3,000 కోసం ఒక వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. రోడ్డుపై జరిగిన ఈ దారుణాన్ని ఎవరూ నిలువరించలేకపోయారు. చివరకు నిందితుడ్ని పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ హత్య (Delhi Murder) జరిగింది. టిగ్రీ ప్రాంతంలోని సంగం విహార్‌కు చెందిన 21 ఏళ్ల యూసఫ్ అలీ, షారుఖ్ అనే వ్యక్తి నుంచి ఇటీవల రూ.3,000 తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో నాలుగు రోజుల కిందట యూసఫ్‌ను షారుఖ్ బెదిరించాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఒక షాపు వద్ద ఉన్న యూసఫ్ అలీపై అతడు కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన అతడ్ని పలుసార్లు కత్తితో పొడిచాడు. దీంతో అలీ రక్తం మడుగుల్లో పడి మరణించాడు.
కాగా, ఆ సమయంలో అక్కడున్నవారు అలీని రక్షించేందుకు చొరవచూపలేదు. అలీ కుప్పకూలిన తర్వాత చివరకు నిందితుడు షారుఖ్‌ను కొందరు పట్టుకుని కొట్టారు. యువకుడి హత్య గురించి తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులకు నిందితుడ్ని అప్పగించారు. గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.