Uttarpradesh : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో ఘోరం జరిగింది. పొలం పనులు ముగించుకుని మేనమామతోపాటు ఇంటికి తిరిగి వస్తున్న బాలుడు ముఖం, చేతులు కడుక్కోవడానికి నది ఒడ్డుకు వెళ్లగా.. అప్పటికే అక్కడ నక్కి ఉన్న మొసలి (Crocadile) ఒక్కసారిగా దాడిచేసి బాలుడిని నదిలోకి ఈడ్చుకెళ్లింది. ఆ తర్వాత మూడుసార్లు నీళ్లలో బలంగా తిప్పికొట్టి చంపేసింది. ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్ జిల్లా (Bahraich District) లో ఈ విషాద ఘటన జరిగింది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. సునీల్ సింగ్ అనే 12 ఏళ్ల బాలుడు తన మామ విజయ్ రాజ్ సింగ్తో కలిసి వరి నాట్లు వేసేందుకు పొలానికి వెళ్లాడు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తూ దారిలో ఘాఘరా నది ఒడ్డున చేతులు, ముఖం కడుక్కుంటున్నాడు. అప్పటికే నది ఒడ్డున నక్కి ఉన్న ఓ మొసలి ఆ బాలుడిపై అమాంతం దాడి చేసింది. కాలును నోటకరిచి నదిలోకి లాక్కెళ్లింది. అంతటితో ఆగక మళ్లీమళ్లీ నీళ్లలో బలంగా తిప్పికొట్టింది. దాంతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కళ్లముందే తన మేనల్లుడిని మొసలి లాక్కెళ్లడం చూసిన విజయ్ రాజ్ సింగ్ వెంటనే నదిలోకి దూకి అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. అక్కడున్న గ్రామస్థులు కూడా అతనికి సాయపడ్డారు. కానీ ఆ మొసలి బలం ముందు వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. బాలుడిని అది నదిలో మరింత లోపలికి లాక్కెళ్లింది. ఈ ఘటన గురించి విజయ్ రాజ్ సింగ్ ఆవేదనతో మాట్లాడుతూ.. ‘నేను వెంటనే నదిలోకి దూకి వాడి చేతిని పట్టుకున్నా. సుమారు ఏడు నిమిషాలపాటు వాడిని వెనక్కి లాగేందుకు ప్రయత్నించా. కానీ ఆ మొసలి చాలా బలంగా ఉంది. వాడిని లోతైన నీళ్లలోకి లాక్కెళ్లిపోయింది. నేను వాడిని కాపాడుకోలేకపోయా’ అని కన్నీటిపర్యంతమయ్యారు.
గ్రామస్థులు చాలాసేపు గాలించిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో సునీల్ మృతదేహాన్ని నది నుంచి వెలికితీశారు. అయితే అప్పటికే మొసలి బాలుడి శరీరాన్ని పాక్షికంగా తినేసిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. బాలుడి నడుము కింది భాగాన్ని మొసలి తినేసిందని ఫారెస్ట్ రేంజర్ సాఖిబ్ అన్సారీ చెప్పారు. కాగా, సునీల్ 6వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన అతను అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు బాలుడు కూడా మరణించడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయ పథకం కింద రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రకాశ్ సింగ్ ప్రకటించారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. గత మే నెలలో గుజరాత్లోని వడోదర జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దేవ్ నదిలో నీళ్లు తాగేందుకు వెళ్లిన 22 ఏళ్ల యువకుడిని మొసలి లాక్కెళ్లి చంపేసింది. ఈ వరుస ఘటనలతో నదీ తీర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
India📍
This tragic incident occurred near the Ghaghara River in Tikuri village, Bahraich district, Uttar Pradesh, where a 12-year-old boy named Sunil was attacked by a crocodile while washing his hands and feet after transplanting paddy. The crocodile seized the boy in its jaws… pic.twitter.com/aTc5zsNbbM
— Nature Chapter (@NatureChapter) July 17, 2026