కోల్కతా: బీజేపీ జెండాపై కండోమ్ (Condom stuck) కనిపించింది. దీనిపై ఆ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చర్యగా బీజేపీ ఆరోపించింది. పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెంగాల్లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో షికర్పూర్ గ్రామంలో బీజేపీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు చోట్ల ఆ పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు. అయితే ఒక చోట ఏర్పాటు చేసిన బీజేపీ జెండా చివరన కండోమ్ వేలాడుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, బీజేపీ కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నకుల్ దాస్ దీనిపై స్పందించారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్న టీఎంసీ ఈ చెడ్డ పని చేసినట్లు ఆరోపించారు. దీంతో కండోమ్ వేలాడుతున్న బీజేపీ జెండాను పోలీసులు తొలగించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు బీజేపీ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. ఇలాంటి పని తమ కార్యకర్తలు చేయరని ఆ ప్రాంత టీఎంసీ అధ్యక్షుడు నయన్ బసక్ తెలిపారు. బీజేపీ తిరోగమన విధానాలకు ఈ సంఘటన నిదర్శనమని విమర్శించారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ సంఘటన వల్ల ఆ ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తతలు జరుగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు.