న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోసారి జూలు విదుల్చుతున్నది. దేశంలో గత నాలుగు రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేనప్పటికీ పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయని, కొత్త వేరియంట్ సామాజికంగా వ్యాప్తి జరుగుతున్నదని అర్థమని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. ఢిల్లీలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 46 శాతం ఒమిక్రాన్ వేరింట్వేనని జీనోమ్ సీక్వెన్సింగ్‌లో బయటపడిందని చెప్పారు.
దేశ రాజధానిలో బుధవారం భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 923 కేసులు వెలుగుచూశాయి. గత మే 30 తర్వాత ఇంత పెద్దమొత్తంలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీచేసింది. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. నగరంలో ఇప్పటివరకు 263 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.