శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కట్టబెట్టకముందే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్రం ప్రభుత్వ ప్రతిపాదనను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ముందుకుతెచ్చిన ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు. ముందుగా డీలిమిటేషన్ చేపట్టి రాష్ట్రహోదా కల్పించిన అనంతరమే కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్ ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేశారు.
కేంద్రం ఎన్నికలు నిర్వహించదలిస్తే ముందుగా రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఒమర్ అబ్ధుల్లా స్పష్టం చేశారు. కాగా ఇటీవల జమ్ము కశ్మీర్ నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన క్రమంలో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోందని కశ్మీర్ నేతలతో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కట్టబెడతామని ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్ నేతలకు ప్రధాని హామీ ఇచ్చారు.