న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. (Omar Abdullah Meet PM Modi) ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత వారిద్దరూ భేటీ కావడం ఇది తొలిసారి. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశం సుమారు 30 నిమిషాలపాటు కొనసాగినట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి, జమ్ముకశ్మీర్‌లో అనంతర పరిస్థితులపై మోదీ, ఒమర్ అబ్దుల్లా చర్చించినట్లు తెలిసింది.
కాగా, పహల్గామ్ దాడి తర్వాత సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ పలు చర్యలు చేపట్టింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అట్టారిలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను మూసివేసింది. హై కమిషన్ల సిబ్బందిని తగ్గించింది. పాక్ జాతీయులకు అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. ఏప్రిల్ 30 నాటికి వారు పాకిస్థాన్ తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది.
మరోవైపు పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేసింది. ఆ దేశ కార్గో నౌకలకు భారత జలాలు, పోర్టుల్లోకి ప్రవేశాన్ని నిషేధించింది. పాకిస్థాన్ నుంచి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులను నిలిపివేసింది. అన్ని రకాల మెయిల్స్, పార్సిల్స్‌ను నిషేధించింది. పాక్ ప్రధాని, ఆ దేశ మీడియాతోపాటు పలువురి యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఖాతాలను భారత్‌లో నిలిపివేసింది.