న్యూఢిల్లీ, జనవరి 31: ఉద్యోగాల కోత మొదలుపెట్టిన టెక్ కంపెనీల బాటలో ఓఎల్ఎక్స్ కూడా చేరిపోనున్నది. తమ సంస్థలో ఏకంగా 15 శాతం ఉద్యోగులను తొలగించాలని ఓఎల్ఎక్స్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,500 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖర్చు తగ్గించుకొనేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకొంటున్నట్టు ఓఎల్ఎక్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు.
ఉద్యోగాల కోతకు దిగుతున్న కంపెనీల్లో డచ్‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఫిలిప్స్ కూడా చేరింది. ప్రపంచవ్యాప్తంగా 6,000 ఉద్యోగులను తొలగించాలని ఈ సంస్థ నిర్ణయించింది. అటు.. మెటా కూడా మరో దఫా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నది. ఇటీవలే ఒకేసారి 11 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించిన మెటా.. తాజాగా మేనేజర్ల వ్యవస్థకు మంగళం పాడాలని నిర్ణయించినట్టు తెలిసింది. తాజాగా సంస్థ సమావేశంలో మెటా సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ మేనేజర్ల వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనేక దశల్లో మేనేజర్లు ఉండటం, మేనేజర్లనే మేనేజ్ చేసే మేనేజర్లు ఉండాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో మేనేజర్ల ఉద్యోగాల్లో కోత విధించడం ఖాయంగా కనిపిస్తున్నది.