Tortoise : ఆలివ్ రిడ్లే (Olive ridley) తాబేళ్ల (Tortoise) జీవన విధానం, పునరుత్పత్తిపై చేస్తున్న పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక ఆలివ్ రిడ్లే తాబేలు ఒడిశా (Odisha) లోని కేంద్రపడ జిల్లా గహీర్‌మఠ్ వద్ద సముద్రంలో ప్రయాణం ప్రారంభించి 51 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) తీరానికి చేరుకుంది. ఈ 51 రోజుల్లో ఆ తాబేలు వెయ్యి కిలోమీటర్లు ఈదినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (PCCF) ప్రేమ్ శంకర్ ఝా (Prem Shankar Jha) తెలిపారు.
ఆలివ్ రిడ్లే తాబేలుకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాగ్‌ను అమర్చి పరిశీలించగా ఈ విషయాలు తెలిశాయని ప్రేమ్ శంకర్ చెప్పారు. గతంలో మరో తాబేలు శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిల మీదుగా ఆంధ్రాకు చేరిందని తెలిపారు. నాలుగేళ్ల కిందట కూడా ఒడిశా తీరంలో ట్యాగ్ వేసిన ఓ తాబేలు 3,500 కిలోమీటర్లు ప్రయాణించి గుడ్లు పెట్టేందుకు ఇటీవల మహారాష్ట్రలోని రత్నగిరి తీరానికి చేరుకుందని వెల్లడించారు.