న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో సెంట్రల్ హాల్లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో.. పాత పార్లమెంట్ బిల్డింగ్‌ను సంవిధాన్ సదన్(Samvidhan Sadan)గా పిలుచుకుందామని ప్రధాని మోదీ అన్నారు. కొత్త బిల్డింగ్‌లోకి వెళ్లినంత మాత్రాన.. పాత పార్లమెంట్ బిల్డింగ్ హుందాతనం ఏమాత్రం తగ్గిపోవద్దు అని అన్నారు. దేశాన్ని ఆత్మ నిర్భరంగా మార్చడమే బాధ్యతగా ఉండాలన్నారు. భవిష్యత్తు కోసం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కేవలం రాజకీయ లాభాల గురించి ఆలోచించవద్దు అని, జ్ఞానం-ఆవిష్కరణలపై ఫోకస్ చేయాలన్నారు.
చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత యువత సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంపై దృష్టి పెట్టిందన్నారు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అన్నారు. ఉత్పత్తిరంగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలని, జీరో డిఫెక్ట్.. జీరో ఎఫెక్ట్‌తో ఉత్పత్తిని తయారు చేయాలన్నారు. మన ఉత్పత్తుల్లో ఎటువంటి లోపం ఉండవద్దు అని, ఆ ఉత్పత్తి వల్ల పర్యావరణంపై ఎటువంటి ప్రభావం ఉండవద్దు అన్నారు.పాత పార్లమెంట్ బిల్డింగ్ నుంచి ఎంపీలు అందరూ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ వైపు ర్యాలీ తీస్తూ వెళ్లారు.